టీఆర్ఎస్​ గెలిస్తే 2 వేల కోట్ల ఫండ్​ : హరీష్ రావు

యాదాద్రి, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భూముల ధరలు తగ్గుతయని మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ​మండలంలో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. ‘పంతంగిలో రూ.లక్షకు ఎకరం భూమి ఉండే. కేసీఆర్​పవర్​లోకి వచ్చినంక రాష్ట్రంలో భూముల ధరలు పెరిగినయ్. కాళేశ్వరం నీళ్లు రాబోతున్నాయ్. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పొరపాటున గెలిస్తే భూముల ధరలు తగ్గిపోతయి’ అని అన్నారు. టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల గెలిస్తే.. హుజూర్​నగర్​కు ఇచ్చినట్టుగా సీఎం కేసీఆర్​ రూ.2 వేల కోట్లు ఇస్తారని హామీ ఇచ్చారు. ఖాళీ జాగాలు ఉన్న వాళ్లకు ఇండ్లు నిర్మించి ఇస్తామని, దీనికి సంబంధించి బడ్జెట్​లో నిధులు కేటాయించామన్నారు.

ఎన్నికల కోడ్​ అయిపోగానే పల్లె దవాఖానాల్లో డాక్టర్లను నియమిస్తామన్నారు. అందరికీ పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. దండు మల్కాపురంలో ఏర్పాటు చేసే కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు అభయహస్తం పైసలు ఇస్తామని, వడ్డీ లేని లోన్లు ఇస్తామన్నారు. మునుగోడును కేటీఆర్​ దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ కూసుకుంట్ల గెలవగానే.. ఏడాదిలోగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.  

రాజగోపాల్​రెడ్డిని గెలిపించండి

మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలని మంత్రి హరీశ్​రావు నోరు జారారు. చౌటుప్పల్​మండలం పంతంగికి వచ్చిన ఆయన ప్రెస్​మీట్​లో మాట్లాడారు. ‘మునుగోడులో మరింత అభివృద్ధి జరగాలంటే రాజగోపాల్​రెడ్డి గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అన్నారు.  ఆ తర్వాత కూడా ఆయన పొరపాటును సరిదిద్దుకోకుండానే మాట్లాడారు. బీజేపీ మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.