![తెలంగాణలో రక్తం పారించే కుట్ర](https://static.v6velugu.com/uploads/2022/08/Minister-Harish-Rao-said-that-the-central-government-has-left-the-administration-and-is-working-to-harass-the-opposition_w7lSTuGsrQ.jpg)
- ప్రశ్నిస్తే అవినీతిపరులుగా ముద్ర వేస్తున్నరు
- ఎమ్మెల్సీ కవితపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్న : హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం పరిపాలనను వదిలిపెట్టి, ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. బీజేపీతో స్నేహం చేస్తే నీతిమంతులుగా, ప్రశ్నిస్తే అవినీతిపరులుగా ముద్ర వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కవిత ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. కవితకు సీబీఐ నోటీసులు ఇస్తుందని ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చెప్పడం చూస్తుంటే.. ఆ పార్టీ డైరెక్షన్‌లోనే సీబీఐ పనిచేస్తోందన్న విషయం స్పష్టమవుతోందని చెప్పారు. శుక్రవారం ఎంఎన్‌జే హాస్పిటల్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కేంద్రం కూలదోస్తున్నదని, దొడ్డిదారిన అధికారం చేపడుతోందని ఆరోపించారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన కేంద్రం.. ఇప్పుడు బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలను కూల్చేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కర్నాటకలో 40% కమీషన్లు తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు ఆరోపించినా అక్కడి నాయకులపై ఎందుకు దాడులు చేయించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
భూమికి బరువయ్యేంత పండుతున్నది
తెలంగాణలోని బీడు భూముల్లో కృష్ణా, గోదావరి నీళ్లు పారించేందుకు తాము ప్రయత్నిస్తుంటే, మత కలహాలు సృష్టించి రక్తం పారించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని హరీశ్ ఆరోపించారు. ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. కర్నాటకలో హిజాబ్ పంచాయితీతో మత కలహాలు సృష్టించడం వల్లఅక్కడ ఐటీ గ్రోత్ ఆగిపోయిందని, హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి కావాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామన్నారు. ఇక్కడ పండే పంటను కొనలేక కేంద్రం చేతులెత్తేసిందని విమర్శించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఇవ్వలేకపోయినా, తాము రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని హరీశ్ అన్నారు.
రోబోటిక్ థియేటర్లు ప్రారంభం
ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో రోబోటిక్ మాడ్యులర్ థియేటర్లు, దోబిఘాట్, కిచెన్‌ను మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌తో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. మరో నెల రోజుల్లో రోబోటిక్ థియేటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. అరబిందో సంస్థ 350 పడకల బిల్డింగ్ నిర్మిస్తోందని, ఇవి అందుబాటులోకి వస్తే ఎంఎన్‌జేలో బెడ్ కెపాసిటీ 750కి పెరుగుతుందన్నారు. గతేడాది కేన్సర్ రోగుల ట్రీట్‌మెంట్ కోసం ఆరోగ్యశ్రీ కింద రూ.111 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. కేన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ స్ర్కీనింగ్ ద్వారా జిల్లాల్లో 200 మంది పేషెంట్లను ఈ ఏడాది గుర్తించామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.