
కంది, వెలుగు : ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు బీఆర్ఎస్ బలమేంటో చూపిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా బలంతో పాటు కార్యకర్తల బలం ఉన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి అని విమర్శించారు.
గడిచిన 5 ఏండ్లలో నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించని ఆయన ఏం మోహం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ రెడ్డి స్వల్ప తేడాతో ఓడినప్పటికీ ఐదేండ్ల పాటు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలు తీర్చారన్నారు. అందుకే సంగారెడ్డిలో ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎలాంటి హోదా లేకపోయినా ప్రజా సమస్యలు పరిష్కరించానన్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని కోరారు. సమావేశంలో టీఎస్ ఎంఐడీసీ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, టీఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, నాయకులు శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, వరలక్ష్మి, ముఖీమ్, బుచ్చిరెడ్డి, నర్సింలు, గోవర్ధన్‌నాయక్, జలందర్ పాల్గొన్నారు.