తెలంగాణ ప్రభుత్వం బోరు బావుల కాడ కరెంటు మీటర్లు పెట్టలేదనే అక్కసుతోనే కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులను ఆపేసిందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఏడాదికి రూ.6వేల కోట్లు చొప్పున గత రెండేళ్లలో రూ.12వేల కోట్లు ఆపారని పేర్కొన్నారు. ఈ కారణం వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఎదురైందని, అయినా సంక్షేమ పథకాల అమలును ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి గత ఐదేళ్లకు సంబంధించిన రూ.30వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం అమ్ముతుంటే.. తాము కాపాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కూడా చేపడుతున్నామని గుర్తు చేశారు. నల్లగొండలోని మర్రిగూడలో నిర్మించిన 30 పడకల సీహెచ్సీ హాస్పిటల్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
మునుగోడు బై పోల్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆస్పత్రిని నిర్మించి మర్రిగూడ ప్రజలకు అందిస్తున్నామని వెల్లడించారు. 42 మంది వైద్య సిబ్బంది మర్రిగూడకు వచ్చారంటే అది సీఎం కేసీఆర్ దార్శనిక పాలన వల్లే సాధ్యమైందన్నారు. అంబులెన్సు, డిజిటల్ ఎక్స్ రే మిషన్ ను కూడా మర్రిగూడ ఆస్పత్రికి ఇచ్చామని తెలిపారు. ‘‘మర్రిగూడ హాస్పిటల్ కు జనరేటర్ , అల్ట్రా సౌండ్ మెషిన్ ను కూడా మంజూరు చేస్తాం. గైనిక్ డాక్టర్ ను ఇక్కడి ఆస్పత్రికి కేటాయిస్తం. క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఇక్కడనే చేయించుకునేటట్టు ఏర్పాట్లు చేస్తం. మునుపెన్నడూ లేని విధంగా నల్లగొండ జిల్లాకు సీఎం కేసీఆర్ 2 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు’’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.