మహిళల కష్టాలు తీర్చేందుకే ఆరోగ్య మహిళ : మంత్రి హరీశ్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ ఒ మంచి కార్యక్రమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించుకోవడం శుభసూచకమని మంత్రి హరీశ్ రావు అన్నారు. కరీంనగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో "ఆరోగ్య మహిళ" కార్యక్రమాన్ని  ఆయన ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజున సీఎం కానుక ఈ పథకమని తెలిపారు. మహిళల కష్టాలు తీర్చేందుకు అనేక పథకాలు తెచ్చిన ఘనత సీఎం దని కొనియాడారు. మిషన్ భగీరథ, ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామన్నారు. గర్భిణుల కోసం ఆరోగ్య లక్ష్మి పథకం ఉందని చెప్పారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. 

మహిళల ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పుకోవడానికి బిడియ పడుతుంటారు. కొందరు ఆర్థిక ఇబ్బందులతో హాస్పిటల్ కు పోవడం లేదని హరీశ్ అన్నారు. ఇలాంటి వారికోసమే ఆరోగ్య మహిళ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో మహిళలు సాధారణంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇకపై మహిళ వైద్యులు, సిబ్బందితో ఆరోగ్య మహిళ పేరుతో ఇవాళ 100 ఆస్పత్రులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 100 ఆస్పత్రుల్లో మహిళల కోసం ప్రత్యేక పరీక్షలు చేసి మందులు, వైద్యం ఉచితంగా అందిస్తారని స్పష్టం చేశారు. సర్జరీలు, ఇతర అడ్వాన్సుడు వైద్య పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సెంటర్ పెడుతున్నామని తెలిపారు.