బీజేపీ డకౌట్.. కాంగ్రెస్​ రనౌట్..​ బీఆర్ఎస్​ సెంచరీ : హరీశ్ రావు 

మెదక్ (చేగుంట), వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డకౌట్​ అవుతుందని.. కాంగ్రెస్​ రనౌట్​ అవుతుందని.. బీఆర్​ఎస్​ సెంచరీ కొడుతుందని మంత్రి హరీశ్​ రావు జోస్యం చెప్పారు.  గురువారం మండలంలోని వడ్యారంలో బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో కాంగ్రెస్​ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రూ.80 వేల కోట్లు ఖర్చు కాలేదు.. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా లక్ష కోట్ల స్కాం అంటున్నారు. కాళేశ్వరం ఎప్పుడు మునిగి పోతే బాగుంటదని కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు.

బాలారిష్టాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. ఒక్క పిల్లర్ వంగితే మునిగింది అంటున్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ కంపెనీయే వంగిన పిల్లర్​ను సరిచేస్తుందన్నారు. ఏనాడు ఒకర్ని నొప్పించని ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి పై దాడి జరగటం బాధాకరమన్నారు. దుబ్బాక లో గతంలో పోటీ చేసిన వాళ్లు ఎన్నో హామీలు ఇచ్చి పక్కన పెట్టారన్నారు. కొత్త ప్రభాకర్​ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నూకలు బుక్కుమన్న బీజేపీకి దుబ్బాకలో నూకలు  లేకుండా చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ALSO READ : మూడు సెగ్మెంట్లకు బీజేపీ అభ్యర్థులు ఖరారు