
- 11 సీట్లు గెలిచేలా ఎత్తులు
- సెగ్మెంట్ల వారీగా మీటింగ్‌లు, సుడిగాలి పర్యటనలు
- అసంతృప్తులకు బుజ్జ గింపులు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి హరీశ్ రావు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా మెదక్జిల్లాలో మెదక్, నర్సాపూర్ సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా తనపై విమర్శలు చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును దృష్టిలో ఉంచుకుని మెదక్ స్థానంలో పద్మా దేవేందర్‌రెడ్డి గెలుపును సవాల్‌గా తీసుకున్నారు.
పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా కాంగ్రెస్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్తిరుపతిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు తదితర నాయకులను బీఆర్ఎస్లోకి రప్పించారు. సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులతో మండలాల వారీగా సర్వే చేయిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ తదనుగుణంగా గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇటీవల ఒకే రోజు పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో, హవేలి ఘనపూర్ మండలం కుచన్‌పల్లిలో, నార్సింగి, చిన్నశంకరంపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లు ఏర్పాటు చేసి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నర్సాపూర్ సెగ్మెంట్లోసునీతారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఆయన వర్గం నాయకులు అసంతృప్తికి గురవడంతో ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయం కుదిర్చారు.
సిద్దిపేట బాధ్యతలు ఇతరులకు..
సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి హరీశ్ రావు జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక ప్రచార బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేటలో ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించడమే కాకుండా వంద ఓట్ల కు ఒక ఇన్‌చార్జిని నియమించి పోలింగ్ రోజు వరకు ప్రచారాలు కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. ఇతర నియోజకవర్గాల ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు సిద్దిపేట పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను ఎన్నికల ప్రచారాలకు సమాయత్తం చేయడంతో పాటు అసంతృప్తులను బుజ్జగిస్తూ ఒక్కటి చేస్తున్నారు. మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్ నిర్వాసితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి హామి ఇచ్చి వారి మద్దతు పొందే ప్రయత్నాలు ప్రారంభించారు. దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి పై దాడి జరగడంతో ఆయన ఆస్పత్రికే పరిమితమయ్యారు. దీంతో దుబ్బాక బాధ్యతలను కూడా తనపైనే వేసుకున్నారు.
సిద్దిపేటకు చెందిన ముఖ్య నేతల్ని దుబ్బాక మండలాల పర్యవేక్షకులుగా నియమించి ప్రచారాలు ఆగకుండా చూస్తున్నారు. దుబ్బాకలో క్షేత్ర స్థాయి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం బాటలు వేస్తున్నారు.
అంతా తానై..
సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు మంత్రి హరీశ్ రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బలహీనంగా ఉన్న సెగ్మెంట్లతో పాటు బలంగా ఉన్న స్థానాల్లో కూడా అన్నీ తానై నడిపిస్తున్నారు. జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులు కాస్త బలహీనంగా ఉండడంతో పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులు వారికి సహకరించడం లేదు. దీంతో వారితో సమావేశమై సమస్యలు పరిష్కరించే పనిలో పడ్డారు.
సంగారెడ్డి సెగ్మెంట్లో ముదిరాజ్, రెడ్డి వర్గాలతో పాటు మైనార్టీలు కొంత అసహనంతో ఉండగా సెగ్మెంట్ ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ ద్వారా ఆయా వర్గాల పెద్దలను పిలిపించి సయోధ్య కుదుర్చడంలో సక్సెస్ అయ్యారు. ఆందోల్ నియోజకవర్గంలో గ్రూపు తగాదాల కారణంగా అక్కడ అసమ్మతి సెగలు ఎక్కువయ్యాయి. అది బీఆర్ఎస్ ప్రత్యర్థికి అనుకూలంగా మారడాన్ని గమనించిన మంత్రి హరీశ్ రావు అసంతృప్తులను పిలిపించి క్రాంతి కిరణ్ ను గెలిపిస్తే తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు రాజకీయ భవిష్యత్కల్పిస్తానని హామి ఇచ్చి ఏకం చేశారు.
ఇక జహీరాబాద్ సెగ్మెంట్ విషయానికి వస్తే మాణిక్ రావు గెలుపు కోసం మంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అలాగే బీఆర్ఎస్ కు పట్టున్న పటాన్ చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.