రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో కూలీ దొరకని పరిస్థితి నుంచి నేడు ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా తెలంగాణ ఉపాధి కల్పించే స్థితికి చేరిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రిహరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఇల్లంతకుంటలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు. ఇల్లంతకుంటలో రూ.17.50కోట్లతో నిర్మించనున్న 50 పడకల హాస్పిటల్నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. రూ.37 లక్షలతో నిర్మించిన ఏఎంసీ కమిటీ కొత్త ఆఫీస్, మహిళా సంఘ భవనం, పల్లె దవాఖానను మంత్రి ప్రారంభించారు.
అనంతరం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఒకప్పుడు తాగునీటికి, సాగునీటికి గోస పడ్డ ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలమైందన్నారు. గతంలో ఎమ్మెల్యే ఇల్లంతకుంటకు వస్తే మహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికేవారన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో సురక్షిత నల్లా నీటిని అందిస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో 30శాతం ప్రసవాలు జరిగితే ఇప్పుడు 70 శాతం జరుగుతున్నాయన్నారు.
ఇల్లంతకుంట కరీంనగర్ , సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా కేంద్రాలకు మధ్యలో ఉంటుందని, అరగంటలో మెడికల్ కాలేజీలు, జనరల్ ఆసుపత్రులకు చేరుకోవచ్చన్నారు. పదేండ్లకు ముందు ఇల్లంతకుంట ఎట్లా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ సీఎం ఆశీస్సులు, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ప్లానింగ్ కమిషన్ వైస్‌చైర్మన్ బి.వినోద్ కుమార్ సహకారంతో ఇల్లంతకుంటను అభివృద్ధి చేశానన్నారు.
జడ్పీ చైర్మన్ అరుణ, వైస్ చైర్మన్ వేణు, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ , సర్పంచ్ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్, లీడర్లు వేణు రావు, శ్రీనాథ్ గౌడ్, నర్సయ్య యాదవ్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ పాల్గొన్నారు.