కాంగ్రెస్సోడు పేలుస్తా అంటడు.. బీజేపోడు కూల్చేస్తా అంటుండు: హరీష్ రావు

యాదాద్రిలో ఒకరోజు ముందుగానే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక కాంగ్రెస్సోడు పేలుస్తా అంటే.. బీజేపోడు కూలుస్తా అంటుండని హరీష్ రావు అన్నారు. కూల్చే నాయకులు కావాల్నా.. ప్రజల అవసరాలు తీర్చే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కావాల్నా ఆలోచన చేయండని అన్నారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ దేవుడిని వాడుకోదన్న ఆయన.. అద్భుతమైన యాదాద్రి దేవాలయాన్ని నిర్మించామని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక్క ప్రభుత్వ కళాశాల కూడా లేదని విమర్శించారు. తెలంగాణలో మాత్రం వచ్చే ఏడాదిలో 9 వైద్య కళాశాలలు రానున్నాయని.. వాటిలో ఒకటి యాదాద్రికి కేటాయించనున్నట్లు హరీష్ స్పష్టం చేశారు. 

బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కరెంటు కోతలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. కాని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నదని చెప్పారు. ఇక ఏప్రిల్ మొదటి వారంలో గొంగిడి సునీత, ఎమ్మెల్యే విప్ చేతుల మీదుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‭ను ప్రారంభించబోతున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.