అడవిబిడ్డలను అన్నదాతలుగా మార్చాం : మంత్రి హరీష్ రావు

  •     ఈ ఘనత కేసీఆర్​దే
  •     భద్రాద్రి జిల్లాలోనే అత్యధిక పోడు పట్టాలు..
  •     ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోడు పట్టాలతో అడవి బిడ్డలను అన్నదాతలుగా మార్చామని, ఆ ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సుగుణ గార్డెన్స్​లో శుక్రవారం జరిగిన ప్రోగ్రాంలో రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్​తో కలిసి పోడు పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 50,595మందికి 1,51,195 ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. మార్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కిందన్నారు. పోడు పట్టాలతో రైతుబంధు, రైతు బీమా, క్రాప్ లోన్లు వంటి పది రకాల లబ్ధి కలుగుతుందన్నారు. పోడు సాగు దారులు ఓనర్లుగా మారారన్నారు. 

పోడు పట్టాలతో గిరిజనులు మార్కెట్ కమిటీ, సహకార సంఘాల్లో పదవులు పొందే అవకాశం ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని గిరిజన కుటుంబాలకు పోడు పట్టాలు ఇచ్చిన కేసీఆర్​ను మర్చిపోవద్దన్నారు. అంతకుముందు నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 25 మందికి పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ​రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్ ​హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, స్పెషల్​ సీఎస్ ​రామకృష్ణారావు, కలెక్టర్​ అనుదీప్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ వినీత్, డీఎఫ్​వో రంజిత్, అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

ఈఏడాది నుంచే ‘మెడికల్ కాలేజీ క్లాసులు

ఖమ్మం, వెలుగు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే 100 సీట్లతో తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. శుక్రవారం పోడు రైతులకు పట్టాల పంపిణీ సందర్భంగా ఖమ్మం వచ్చిన ఆయన మంత్రి పువ్వాడతో కలిసి మెడికల్​ కాలేజీ కోసం పాత కలెక్టరేట్​లో ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేసి సకాలంలో తరగతులు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. 

పాత కలెక్టరేట్ఐదేకరాలు, ఆర్అండ్ బీ ఆఫీస్​ మూడెకరాలతో కలిపి సువిశాల ప్రాంగణంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశామని చెప్పారు. వారి వెంట ఎమ్మెల్యే రాములు నాయక్, మేయర్ పునుకొల్లు నీరజ, కలెక్టర్ గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, డీఎంహెచ్​ఓ మాలతి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.