ఇక అటవీ అధికారుల వేధింపులుండవ్ : హరీశ్‌‌ రావు

ఇక అటవీ అధికారుల వేధింపులుండవ్
పోడు రైతులకూ రైతు బంధు, ఉచిత విద్యుత్: హరీశ్‌‌ రావు
వెన్నుపోటుదారులు వెళ్లిపోయారంటూ పరోక్షంగా పొంగులేటిపై ఫైర్
ఖమ్మంలో పోడు పట్టాల పంపిణీ ఇక అటవీ అధికారుల వేధింపులుండవ్
అందరిలానే పోడు రైతులకూ రైతు బంధు, ఉచిత విద్యుత్: హరీశ్‌‌‌‌రావు

ఖమ్మం, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నందున ఇకపై పోడు రైతులకు ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచి వేధింపులు ఉండవని మంత్రి హరీశ్‌‌‌‌రావు అన్నారు. పోడు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతు బంధు, ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. శుక్రవారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో పోడు రైతులకు మంత్రి పువ్వాడ అజయ్‌‌‌‌తో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘జులై 2న ఖమ్మంలో బహిరంగ సభకు వస్తున్న రాహుల్ గాంధీని పలు విషయాలు అడగదలుచుకున్నా. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ఆసరా పెన్షన్ రూ.2 వేలు, రూ.4 వేల చొప్పున ఇస్తున్నరా? రైతుబంధు, రైతుబీమా పథకాలు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా? ఏ రాష్ట్రంలో అయినా కల్యాణలక్ష్మి వస్తున్నదా? నీళ్లు ఇస్తున్నారా?” అని ప్రశ్నించారు.

పార్టీకి పట్టిన శని పోయింది

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డిపై హరీశ్ రావు పరోక్షంగా మండిపడ్డారు. ‘‘ఈడ ఒకాయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నడట. ఆయన చేరితే ఏందో అయితదని వాళ్లు అనుకుంటున్నరు. ఆయన్ను పక్కన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఆయనో ఆర్థిక అరాచకవాది అని గతంలో ఇదే భట్టి విక్రమార్క మాట్లాడిండు. మేం వెళ్లగొట్టినోళ్లను మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ పార్టీలోకెళ్లి ఎవరో వస్తున్నరు, ఏదో జరుగుతుందని అనుకుంటున్నరు. మీకు దిక్కులేదు, ఆయనకు సక్కి లేదు కనుక మీరు ఒక్కటయిన్రు. మాకు పీడపోయింది.. శనిపోయింది.. వెన్నుపోటు పొడిచి పార్టీ సీట్లు గెలవకుండా చేసిండు. కచ్చితంగా ఈసారి రివర్స్ అయితది.. ఆనాడు ఒకటి గెలిస్తే తొమ్మిది పోయినయ్.​. ఈసారి తొమ్మిది గెలిస్తం.. ఒక్కటి మాత్రమే పోతది” అని అన్నారు.