ప్రభుత్వాసుపత్రులపై పేదలకు నమ్మకం పెరిగింది: హరీశ్ రావు

ప్రభుత్వాసుపత్రులపై పేదలకు నమ్మకం పెరిగింది: హరీశ్ రావు
  • ఆశ వర్కర్లు గర్భిణులను అక్కాచెల్లెళ్లలా చూస్కోవాలి : హరీశ్ రావు
  • జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,500 మంది ఆశ వర్కర్లు నియామకం 

మాదాపూర్, వెలుగు: పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యంపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​​రావు అన్నారు. ప్రస్తుతం వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం లేదని తెలిపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో హెల్త్​డిపార్ట్​మెంట్​లో శుక్రవారం 1,500 మంది ఆశ వర్కర్లు కొత్తగా జాయిన్​అయ్యారు. వారికి మాదాపూర్​ శిల్పకళావేదికలో మంత్రులు మహమూద్​ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్​తో కలిసి హరీశ్​రావు నియామక పత్రాలు అందజేశారు. 

అనంతరం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో హరీశ్​మాట్లాడారు. వైద్య వృత్తిలో ఉన్న వాళ్లకు దొరికిన ప్రేమ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి దొరకదన్నారు. పేదలు అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్లపై ఉన్నప్పుడు డాక్టర్లు, సిబ్బంది వారికి దేవుళ్లలా కనిపిస్తారని చెప్పారు. అందరం కుటుంబంలా కలిసి పనిచేసి మంచి సేవలు అందిద్దామని వారికి సూచించారు. ఆశ వర్కర్లు గర్భిణులను అక్కాచెల్లెళ్లలా చూస్కోవాలన్నారు. రాష్ట్రం రాక ముందు ‘నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు’ అనేలా ఉండేదని, కానీ ఇప్పుడు ‘నేను పోత బిడ్డ సర్కారు దావఖానకే’ అనే విధంగా సర్కారు హాస్పిటళ్లను తయారు చేశామన్నారు. 

ప్రతిపక్షాలవి పార్టిషియన్​ పాలిటిక్స్​..

కడుపులో బిడ్డ పడగానే కేసీఆర్​ ప్రభుత్వం న్యూట్రిషియన్​ కిట్​ఇస్తున్నదని, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్​ కిట్ అందజేస్తున్నదని చెప్పారు. ‘ప్రజలు బలంగా ఉండాలే, ప్రభుత్వం బలంగా ఉండాలని బీఆర్​ఎస్​ ప్రభుత్వం న్యూట్రిషియన్​ పాలిటిక్స్​ చేస్తుంటే.. రాష్ట్రంలోని కొన్ని పార్టీలు పార్టిషియన్​ పాలిటిక్స్​ చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ప్రభుత్వం తల్లిబిడ్డల సంక్షేమం కోసం పనిచేస్తుందని ప్రజలకు తెలియజేయాలని మంత్రి ఆశలకు సూచించారు. 

50 వేలు ఖర్చు చేసి ట్రైనింగ్​ ఇస్తం..

ఆశ వర్కర్లకు రూ.50 వేలు ఖర్చు చేసి శిక్షణ ఇచ్చి, అందరికీ రెండు జతల దుస్తులు ఇస్తున్నామని హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల మంది ఆశ వర్కర్లకు ఈనెల నుంచి ​ఫోన్​ బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. దేశంలోనే ఆశ వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తక్కువ ఇస్తున్నారని తెలిపారు.