దానిని భూతద్దంలో చూడొద్దు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు : యాదగిరిగుట్టలో అకాల వర్షానికి రోడ్లు కొట్టుకుపోవడం చిన్న సమస్యేనని, దానిని భూతద్దంలో చూడొద్దని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం గుడి ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహా స్వామి ఆలయంలో భక్తులకు సౌలతులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఎండో మెంట్ అధికారులతో రివ్యూ చేపట్టారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 79 మిల్లీమీటర్ల భారీ వర్షం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ పరిసరాల్లో పెండింగ్ పనులు కొనసాగుతుండటంతో పైప్ లైన్ లో మట్టి, ఇసుక కూరుకుపోయి నీరు నిలిచిపోయిందే తప్ప నాసిరకం పనుల వల్లో, నిర్మాణ లోపం వల్లో అలా జరగలేదన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు జరిగాయన్నారు. కొత్త నిర్మాణాల వల్ల కొన్నిరోజుల పాటు నిర్వహణలో సమస్యలు వస్తుంటాయని, వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. స్వయంభూ దర్శన ప్రారంభం తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని, ఒక్కొక్కొటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మంచినీరు అందుబాటులో ఉంచాలని, ఎండవేడిమి నుంచి సేద తీరేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.