హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసం యాదాద్రిపై విమర్శలు సరిచేయడం సరికాదని, అనవసరంగా పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బ తీయొద్దన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రిలో భక్తులకు సౌకర్యాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరణ్య భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్ & బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత్ కుమార్, ఆలయ ఇంచార్జీ ఈవో రామకృష్ణ, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనంతరం మంత్రి మాట్లాడుతూ... యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేశారన్నారు. స్వయంభు దర్శనాల ప్రారంభం తర్వాత అక్కడ చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని తెలిపారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించకుని వేళ్లేలా ఎల్లవేళల కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, పవిత్రమైన ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. 79 మిల్లీమీట్లర్ల అకాల భారీ వర్షం కారణంగా నిర్మాణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు కొనసాగుతుండటంతో పైప్ లైన్ లో మట్టి, ఇసుక కూరుకుపోయి నీరు నిలిచిపోయిందే తప్పా నాసిరకం పనుల వల్లో, నిర్మాణ లోపం వల్లో అలా జరగలేదని స్పష్టం చేశారు. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరించారని. అకాల వర్షాలతో ఉత్పన్నమైన చిన్న చిన్న సమస్యలను అధిగమించామని తెలిపారు.
ప్రధాన ఆలయంతో పాటు మిగితా నిర్మాణాలు నూతనంగా చేపట్టినందు వల్ల కొన్ని రోజుల పాటు నిర్వహణలో పురోగతి చూపిస్తూ మందుకు వెళ్ళాల్సి ఉంటుందని, దీన్ని పెద్ద తప్పిదంగానో లేదా పొరాపాట్లుగా చూడాల్సిన లేదని అభిప్రాయపడ్డారు. సర్దుబాటు సమయంగా దీన్ని భావించి, అన్ని అడ్డంకులను అధిగమించి అద్భుతమైన వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో వేచి ఉన్న అన్ని సమయాలలో భక్తులకు మంచినీరు అందించాలని, అదేవిధంగా భక్తులు ఎండవేడిమి నుంచి సేద తీరేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి కల్పనలో ఆలస్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మరిన్ని వార్తల కోసం...