నిర్మల్, వెలుగు: రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువు చేసుకుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖండిస్తోందని, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. నిర్మల్పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని ప్రజలను కోరారు. రైతుబంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగే యాసంగి పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని తెలిపారు.
బీజేపీ నేతల తీరుపై ఆవేదన
బీజేపీ నేతలు దౌర్జన్యాలు, బెదిరింపులకు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. దసరా పండుగ రోజు మహాలక్ష్మి ఆలయం వద్ద వేడుకల్లో బీజేపీ నేతలు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. సాంప్రదాయ రీతిలో వేడుకలు నిర్వహిస్తుండగా భగ్నం చేసేందుకు కుట్ర చేశారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం బాధాకరమన్నారు. వారి తీరును విశ్వహిందూ పరిషత్ నేతలు కూడా తప్పుబట్టారని గుర్తు చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.