తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలకు ప్రాధాన్యం : ఇంద్రకరణ్ రెడ్డి 

  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఆడపడుచులందరికీ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ లో పొదుపు సంఘాల మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సంస్కృతి

సాంప్రదాయాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటం ఆడారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

గీత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని మంత్రి అన్నారు. నిర్మల్​లోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మోకు దెబ్బ గౌడ జన గర్జన సభకు మంత్రి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు అన్ని రంగాల్లో సమ ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు.

రాజకీయంగా కూడా వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ రవికుమార్ గౌడ్, గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ అమరవీని నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ రాగుల సిద్ధి రాములు, ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజు, జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగాగౌడ్, ప్రచార కార్యదర్శి రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.