నిర్మల్, వెలుగు: దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రవేశపెట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్లో శుక్రవారం ఆయన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
విద్యార్థుల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించేందుకు అల్పాహార పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, సర్పంచ్ వినోద్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
స్టూడెంట్లతో కలిసి విప్ బ్రేక్‌ఫాస్ట్
కోల్‌బెల్ట్: మందమర్రి పట్టణం ఫిల్టర్ బెడ్ ఏరియాలోని మండల ప్రైమరీ స్కూల్లో సీఎం బ్రేక్ఫాస్ట్పథకాన్ని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్బదావత్ సంతోష్ ప్రారంభించారు. స్టూడెంట్లతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం మందమర్రిలోని సమ్మక్క సారలమ్మ మహిళా భవన్, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆఫీసుల్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. యువకులకు కేసీఆర్ క్రీడా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నరేందర్, డీఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్కమిషనర్లు గద్దె రాజు, వెంకటనారాయణ, క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం
ఆదిలాబాద్ టౌన్: సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మెనూ ప్రకారం నాణ్యతతో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్రాహుల్ రాజ్అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర జిల్లా పరిషత్ హైస్కూల్లో ప్రజా ప్రతినిధులతో కలిసి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం వారి ఎదుగుదలకు దోహదపడుతుందని, వారి ఏకాగ్రత మెరుగవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేశ్, ఎంఈఓ జయశీల, అశోక్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.