నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం నారాయణపురరం మండలం సర్వేల్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుగోడు ఎన్నికలో ఓడిపోతామని బీజేపీ నాయకుల్లో భయం మొదలైందని, అందుకే వాళ్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు.
ఇది బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, త్వరలోనే కమలం పువ్వు వాడిపోక తప్పదని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.