ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా క్షేత్రానికి త్వరలోనే మిషన్ భగీరథ నీటి సరఫరా చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా క్షేత్ర అభివృద్ధికి రూ.50 లక్షలు కేటాయించామని, మరో రూ.50 లక్షలు మంజురు చేస్తామన్నారు. ఆదివాసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. మేసం వంశీయులే రూ. 5 కోట్లతో గర్బగుడి నిర్మించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయంలో శిల్పాలను అద్భుతంగా చెక్కారని ప్రశంసించారు. నాగోబా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా మెస్రం యూత్ చేస్తున్న సేవల్ని ప్రశంసించారు.
18 వరకు ఉత్సవాలు..
డిసెంబర్ 12వ తేదీ నుండి ఈనెల 18 వరకు నాగోబా జాతర జరగనుంది. ఇందులో భాగంగా మెస్రం వంశస్తులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. 18న నాగోబా విగ్రహం పున:ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. మొత్తం ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, భజన కార్యక్రమాలు జరగనున్నాయి.
సొంత నిధులతో..
కేస్లాపూర్‌లో మెస్రం వంశీయులు తమ సొంత నిధులతో కొత్తగా నాగోబా ఆలయాన్ని నిర్మించారు. 2018లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. నాగోబా జాతరతో పాటు ఆలయ విశిష్టత, చరిత్రను భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో మెస్రం వంశస్తులు తమ సొంత డబ్బులతో కొత్త నాగోబా ఆలయాన్ని నిర్మించారు. ఇందుకోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీయులు నివాసం ఉండే ఊరురా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. ఇలా వసూలైన రూ. 5కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు.