బీఆర్ఎస్ను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలాంటి ఎన్ని పార్టీలు వచ్చినా సీఎం కేసీఆర్ ను ఏమి చేయలేవన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల ఉచిత కరెంట్ ఉందన్నారు. ఏపీ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నట్లుగా జగదీశ్ రెడ్డి తెలిపారు.
కేంద్రంపై విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కనీసం మంచినీళ్ల సౌకర్యం లేదని విమర్శించారు. పేదల ఖాతాల్లో 15 లక్షల వేస్తానని మోడీ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. 60 ఏళ్లుగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం అభివృద్ధి చేశాయో బేరీజు వేసుకోవాలని సూచించారు.