రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదు: జగదీష్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. తెలంగాణ బిల్లుల ఆమోదానికి ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్తోందని జగదీష్ రెడ్డి చెప్పారు. రాజకీయ ఉద్దేశ్యంతోనే తెలంగాణ బిల్లుల మీద గవర్నర్ సంతకాలు పెట్టలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోడీపైనా విమర్శలు చేశారు. 

దేశంలో ప్రజల నుండి వసూలు చేస్తున్న సొమ్మును తీసుకెళ్లి గుజరాతీయులకు దోచిపెడుతున్నారని మోడీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు 19 లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజారిటీ మొత్తం తెలంగాణా ప్రజల సొమ్మే ఉందని చెప్పారు. కేంద్రప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచాడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో.. వేలాదిమంది మహిళలతో కలిసి ఖాళీ సిలిండర్ల ప్రదర్శన నిర్వహించారు. పెద్ద గడియారం చౌరస్తా వద్ద జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. మోడీ ప్రధానిగా ఎన్నికైన రోజున 350 రూపాయలు ఉన్న గ్యాస్ బండ.. ప్రస్తుతం 1200 రూపాయలకు పెంచేశారని కేంద్రంపై జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.