ఏపీ సంగమేశ్వరం కడుతున్నట్టు ఈమధ్యే తెలిసింది

  • సర్వే చేస్తున్నామని చెప్పి ఏపీ మోసం చేసింది: జగదీశ్​ రెడ్డి
  • వైఎస్‌‌‌‌ లేకున్నా కాంగ్రెసోళ్ల బానిస బతుకులు మారలె
  • రాయలసీమ లిఫ్ట్ పనులాపితే జగన్​తో చర్చలకు సిద్ధం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫొటోలు దొరకకనే సంగమేశ్వరంపై ఫిర్యాదు చేయకుండా ఆగిపోయామని రెండ్రోజుల క్రితం మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి కామెంట్‌‌చేస్తే.. ఏపీ సంగమేశ్వరం కడుతోందని ఈమధ్యే తెలిసిందంటూ మరో మంత్రి జగదీశ్‌‌ రెడ్డి తాజాగా కామెంట్‌‌ చేశారు. సంగమేశ్వరంతో ఏపీ ప్రభుత్వం నీళ్లన్నీ మలుపుకుపోతోందని ‘వెలుగు’ ఏడాది క్రితమే ఫొటోలతో సహా కథనాలు ప్రచురించినా.. ప్రభుత్వానికి మాత్రం ఈ మధ్యే తెలిసిందట. శుక్రవారం టీఆర్ఎస్‌‌‌‌ ఎల్పీలో ఎమ్మెల్యేలు భాస్కర్‌‌‌‌రావు, సైదిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన జగదీశ్‌‌రెడ్డి.. ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వమే ఎన్జీటీకి వెళ్లి ప్రాజెక్టుపై స్టే తెచ్చిందన్నారు. కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌ వేస్తే సర్వే మాత్రమే చేస్తున్నామని చెప్పిన ఏపీ సర్కారు తెలంగాణను మోసం చేసిందన్నారు. ‘ఏపీ అక్రమ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌‌‌‌ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌‌‌‌ షెకావత్‌‌‌‌తో ఫోన్‌‌‌‌లో మాట్లాడారన్నారు. పనులు ఆపాలని కేంద్రాన్ని కోరారు. కానీ, బీజేపీతో జగన్‌‌‌‌ కుమ్మక్కయ్యి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఆంధ్రా పాలకులు మొదటి నుంచి తెలంగాణను ఎండబెట్టారు. నీళ్ల దోపిడీకి చంద్రబాబు ఒక్క అడుగు ముందుకేస్తే వైఎస్‌‌‌‌ వంద అడుగులు వేశారు. వైఎస్‌‌‌‌ జలదోపిడీకి ఆరోజు వంత పాడినోళ్లే ఇప్పుడు కేసీఆర్‌‌ను విమర్శిస్తున్నారు. వైఎస్‌‌‌‌ లేకున్నా కాంగ్రెస్‌‌‌‌ నేతల బానిస బతుకులు మారడం లేదు.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి ’ అని చెప్పారు.

వైఎస్‌‌‌‌ లెక్కనే జగన్‌‌‌‌ది తెలంగాణ వ్యతిరేక ధోరణి
కేసీఆర్‌‌‌‌ చేసినట్టుగా గోదావరి నీళ్లను తరలించేందుకు ఏపీ సీఎం జగన్‌‌ ఒప్పుకుంటే రెండు రాష్ట్రాలకూ మేలు జరిగేదని మంత్రి అన్నారు. ‘వైఎస్‌‌‌‌ తరహాలోనే జగన్‌‌‌‌కు తెలంగాణ అంటే వ్యతిరేక ధోరణి ఉంది. రాయలసీమ లిఫ్ట్‌‌‌‌ పనులు ఆపి, జీవో విత్‌‌‌‌డ్రా చేసుకుంటే జగన్‌‌‌‌తో చర్చలకు సిద్ధమే. జల దోపిడీని ట్రిబ్యునల్‌‌‌‌కే కాదు ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రభుత్వం మౌనంగా ఉందని కొందరు బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్‌‌‌‌కు మించి పోరాడే వారు ఎవరున్నారు’ అని ప్రశ్నించారు.