నల్గొండ జిల్లా: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అమిత్ షా మునుగోడుకు వచ్చిన రోజే ఈ కుట్రకు అంకురార్పణ జరిగిందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అమిత్ షా ఆ సభలో చెప్పారని గుర్తు చేశారు. శనివారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమానికి బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. కానీ రాష్ట్ర ప్రజల చైతన్యం ముందు వారి కుట్రలు పారలేదని మంత్రి చెప్పారు.
మునుగోడులో తమ పార్టీ విజయంతో బీజేపీ పతనానికి పునాదులు పడతాయని అన్నారు. బీజేపీ కుట్రలను అర్థం చేసుకోవాలని కోరారు. మునుగోడు కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిందేమీ లేదని చెప్పారు. నవంబర్ 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు.