దేవరకొండ, కొండమల్లేపల్లి (పిఏపల్లి), గుడిపల్లి, నకిరేకల్, వెలుగు : డిండి ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం దేవరకొండ పట్టణ శివారులో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు పెంచికల్‌పహాడ్ శివారులో రూ.2.65 కోట్లతో నిర్మించిన ఇండోర్స్టేడియంతో పాటు కొత్త మండలం గుడిపల్లిలో సీల్దార్ కార్యాలయం, పీహెచ్‌సీని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ పట్టణంలో పీఆర్టీయూ రీజినల్ ఆఫీస్‌ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ రఘోతంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. 60 ఏండ్లు రాష్ట్రాన్ని పాలించినా పేదలకు ఇండ్లు ఇవ్వనోళ్లు కూడా సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దేవరకొండను సస్యశ్యామలం చేసే పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు కావాలనే కోర్టుల్లో కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సీఎం కేసీఆర్ కృషితో ఇటీవలే ప్రాజెక్టులో తొలి పంపును ప్రారంభించామని చెప్పారు. రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వారి మాటలు పట్టించుకోకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ పాటిల్, శ్రీనివాస్, ఆర్డీవో శ్రీరాములు, జడ్పీటీసీ అరుణ సురేశ్‌గౌడ్, డిండి, పీఏపల్లి ఎంపీపీలు ఎంపీపీ మాధవరం సునితా జనార్ధన్‌రావు, వంగాల ప్రతాపరెడ్డి, వైస్ ఎంపీపీ అరవపల్లి సరితనరసింహ, కొండభీమనపల్లి సర్పంచ్విద్యావతి వెంకట్‌రెడ్డి, యాదాద్రి ఇన్‌ఫ్రా చైర్మన్ ముచ్చర్ల శ్రీకాంత్ , కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.