బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే జాతీయ పార్టీ ఆలోచన

బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే జాతీయ పార్టీ ఆలోచన

సూర్యపేట: దేశాన్ని అభివృద్ధి పరచడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమైనందునే కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం  కల్నల్ సంతోష్ బాబు  రెండవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలోని స్ఫూర్తివనం వద్ద సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం కల్నల్ సంతోష్ బాబుకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ... దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేయలేకపోయారని, సహజవనరులు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చారని కాంగ్రెస్ , బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. బీజేపీ పాలన దేశాన్ని మధ్యరాతి యుగం వైపు తీసుకెళ్తున్న నేపథ్యంలో దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని ఆకాంక్షించారు. 

ప్రత్యామ్నాయ అజెండా తీసుకొచ్చే శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఈ క్రమంలోనే ఎనిమిదేళ్ళలో తెలంగాణా రూపురేఖల్ని మార్చినట్లుగానే కొత్త తరానికి కొత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారని తెలిపారు. కేసీఆర్ కొత్త అజెండా పిలుపు పట్ల దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని, త్వరలోనే దేశ రూపురేఖల్ని మార్చే అజెండాను కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి చెప్పారు. అందరి కలల్ని నిజం చేసేది ప్రజలేనన్న ఆయన... కేసీఆర్ ఎజెండా నచ్చితే ప్రజలే ఆశీర్వదిస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.