ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చినం : ఇంద్రకరణ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు :  బీఆర్‌‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆదివారం సూర్యాపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆధునీకరణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర బ్రహ్మణ పరిషత్ చైర్మన్‌ రమణాచారితో కలిసి పరిశీలించారు.  అనంతరం దురాజ్ పల్లి సమీపంలో రూ 2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..

ఆలయాలను అభివృద్ధి చేయడంతో పాటు అర్చక ఉద్యోగులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు.  దేశంలోనే తొలి బ్రాహ్మణ సదనం భవన్ గోపన్‌ పల్లిలో ఏర్పాటు చేయగా.. రెండోది సూర్యాపేటలోనేనని చెప్పారు.  అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన  బ్రాహ్మణులు, రైతుల గురించి ఆలోచన చేసింది సీఎం కేసీఆరేనన్నారు. బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాలకు వేధికగా, పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా నిలవనుందన్నారు.  

అంతకుముందు రాష్ట్ర బ్రహ్మణ పరిషత్‌ రమణాచారి వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  మంత్రి జగదీశ్ రెడ్డి సైతం ఆలయ అభివృద్ధికి తన వంతుగా రూ.40 లక్షల మంజూరు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,  బ్రాహ్మణ పరిషత్  వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు, సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి,  కలెక్టర్ వెంకట్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల లబ్ధిదారులను పాదర్శకంగా ఎంపిక చేస్తున్నామని  మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు ఆదివారం కలెక్టరేట్‌లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,  కలెక్టరేట్‌ వెంకట్‌రావుతో కలిసి  లాటరీ పద్ధతిలో  804 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ ఇండ్లు రాని వాళ్లు నిరాశ చెందవద్దని, త్వరలోనే వారికి కూడా అందిస్తామని  హామీ ఇచ్చారు.  

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, అడిషనల్  కలెక్టర్ వెంకట్ రెడ్డి,  గ్రంథాలయ సంస్థ చైర్మన్  నిమ్మల శ్రీనివాస్ గౌడ్,  మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్,  ఆర్డీవో వీర బ్రహ్మ చారి, డీఎస్పీ నాగభూషణం పాల్గొన్నారు.