మునుగోడులో కేసీఆర్ సభకు ఏర్పాట్లు

  • 20న మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ

నల్గొండ జిల్లా: ఈ నెల 20వ తేదీన మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడు మండల కేంద్రంలో జరగనున్న కేసీఆర్ బహిరంగ సభకు ప్రజాదీవెన సభగా నామకరణం చేశారు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. నియోజకవర్గంపై మంత్రివర్గం అంతా ఫోకస్ చేయగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు.. మునుగోడుతో సంబంధాలున్న ఇతర ప్రాంత నాయకులంతా ఈ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించారు.

టీఆర్ఎస్ కు ముఖ్యంగా కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న మునుగోడు  ప్రజాదీవెన సభ కోసం జరుగుతున్న  ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏర్పాట్లకు సంబంధించి పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భారీ జనసమీకరణ చేపట్టనున్న దృష్ట్యా సభ నిరంతరాయంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచనలిచ్చారు.