- ఇప్పటికే 13 మంది జానయ్య అనుచరులు, బంధువులపై కేసులు
- హైకోర్టులో జానయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు
- ఒక కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో జైలుకు పంపేలా ప్లాన్!
- చలో సూర్యాపేటకు పిలుపునిచ్చిన బహుజన సంఘ నాయకులు
సూర్యాపేట, వెలుగు : డీసీఎంఎస్ చైర్మన్, బీఆర్ఎస్ నేత వట్టె జానయ్య యాదవ్ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి పట్టు వీడడం లేదు. జానయ్య అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ఆయన అనుచరులు, బంధువులపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికే 13 మందిపై కేసులు నమోదు చేయగా, నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు జానయ్య బాధితులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాజాగా జానయ్య పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
ఇప్పటికే అతనిపై12 కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఓ కేసులో బెయిల్ దొరికితే మరో కేసులో జైలుకు పంపేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బీసీ నేత అయిన జానయ్యపై మంత్రి జగదీశ్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ బహుజన సంఘ నాయకులు చలో సూర్యాపేటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సూర్యాపేట బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో తెలియక గులాబీ పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.
పోటీ చేస్తానన్న వెంటనే కేసులు
వట్టె జానయ్య యాదవ్ కేసుల అంశం బయటికి వచ్చాక సూర్యాపేట బీఆర్ఎస్లో సీన్ మారిపోయిందనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీపై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. జానయ్య యాదవ్ తొమ్మిదేండ్లుగా మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయన మద్దతుతోనే జానయ్యకు కీలక పదవి వచ్చింది. అయితే ఆయన సూర్యాపేట బీఆర్ఎస్టికెట్ ఆశించి భంగపడ్డాడు. సీఎం కేసీఆర్తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే సూర్యాపేటలో ఏదో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని జానయ్య ప్రకటించాడు. ఆ తర్వాత జానయ్య తమ భూములను కబ్జా చేశాడంటూ ఒకే రోజు 72 మంది బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తనను విభేదించాడనే కోపంతో మంత్రి జగదీశ్ రెడ్డి.. జానయ్యపై కేసులు పెట్టించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఒకవైపు భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం పోలీసులు జానయ్య ఇంట్లో సోదాలు చేయగా, మరోపక్క జానయ్య రైస్ మిల్లులపై అధికారులు దాడులు నిర్వహించారు. గతంలో అతని భూకబ్జాలపై మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, పోటీ చేస్తానని ప్రకటించిన వెంటనే అకస్మాత్తుగా కేసులు పెట్టడం వెనుక కుట్ర దాగి ఉందని బహుజన పార్టీల లీడర్లు, బీసీ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు ఆక్రమణకు గురైన తమ భూములను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు జానయ్యను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కొన్ని భూములను బాధితులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. గాంధీ నగర్ కు చెందిన కొందరు జానయ్య భూముల్లో తమకు పొజిషన్ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
ALSO READ: డెంగీ దడ.. హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్న రోగులు
20 రోజులుగా అజ్ఞాతంలోనే..
గత నెల 25న హైదరాబాద్ లో నిర్వహించిన బీసీ గర్జనలో పాల్గొన్న జానయ్య ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు జానయ్య కుటుంబ సభ్యులు, అనుచరులపై కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేయగా, వీరిలో జానయ్యతోపాటు ఆయన కొడుకు గణేశ్, మేనల్లుడు శ్రీకాంత్, మరో ఐదుగురు ఉన్నారు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కూడా పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. వారిలోని నలుగురిని అరెస్ట్ చేసి జానయ్య ఆచూకీ కోసం విచారించారు. ఈ క్రమంలో కేసులకు బెదిరేది లేదని తాజాగా జానయ్య ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
బీసీ నినాదం ఎత్తుకున్నందుకే తనపై కావాలని కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా పోరాటం వీడేది లేదని ప్రకటించారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, తనను అరెస్ట్‌చేయకుండా ముందస్తు బెయిల్ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను సోమవారం కోర్టు కొట్టేసింది. ఇప్పటికై అతనిపై నమోదైన కేసులపై ఈ నెల 13లోపు వివరణ దాఖలు చేయాలని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు నోటీసులు జారీ చేసింది. పీడి యాక్ట్ నమోదు చేయరాదని ఉత్తర్వులలో పేర్కొంది. జానయ్యపై ఎలాగైనా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే జానయ్య హైదరాబాద్ లో ఉన్నారని కొందరు, డిల్లీలో ఉన్నారని మరికొందరు చెబుతున్నారు.
బహుజన సంఘాల మద్దతు
జానయ్యపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తున్న బహుజన సంఘాల నాయకులు చలో సూర్యాపేటకు పిలుపునిచ్చారు. గత సోమవారం ఆ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బీఎస్పీ స్టేట్చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సూర్యాపేటలోని జానయ్య ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. జానయ్య పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో గత శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు పలువురు బహుజన నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న చలో సూర్యాపేట కార్యక్రమంపై అందరి దృష్టి నెలకొంది. మరోవైపు జానయ్య అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ నుంచి ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకున్నారని తెలుస్తోంది. మంత్రి జగదీశ్ తీరుపై బీసీ వర్గాలు.. ముఖ్యంగా యాదవులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సీఎంకు రిపోర్ట్ వెళ్లిందనే టాక్నడుస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ , ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలు చేశారంటూ గౌడ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ మూడు సామాజిక వర్గాలదే బలమైన ఓట్ బ్యాంకు. ఉమ్మడి నల్గొండలోని తాజా పరిణామాలపై మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ఫోన్ చేసి మాట్లాడారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.