నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ పట్టణాన్ని రూ. 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఒక్క రోజే లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్‌తో కలిసి మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి నల్గొండను పచ్చని కొండగా మార్చాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వచ్చేదని, మిషన్ భగీరథతో ఆ బాధ తీరిపోయిందన్నారు. హరితహారం కింద నల్గొండ జిల్లాలో 15,52,470 మొక్కలు నాటినట్లు చెప్పారు. నల్గొండ పట్టణంలో గడియారం సెంటర్‌తో పాటు, రోడ్ల విస్తరణ, పార్కుల ఆధునికీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తున్నామన్నారు. పేద, మధ్య తరగతి స్టూడెంట్ల కోసం గురుకులాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ఖుష్బూగుప్తా, భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ రమణాచారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రూ. 2 కోట్లతో ఆధునికీకరించిన ఇండో స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు.
మాజీ సైనికుల సంక్షేమానికి కృషి
నల్గొండ లోని పానగల్ రోడ్డులో నిర్మించిన మాజీ సైనికుల సంక్షేమ భవన్‌ను సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ సైనికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, నల్గొండ జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బండారి నరసింహ, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.