సూర్యాపేట, వెలుగు: ‘విద్యుత్ రంగంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెలంగాణ నేడు దేశంలో విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా నిల్చింది. రాష్ట్రం ఏర్పడిన రెండు, మూడు ఏండ్లలోనే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను ఇచ్చుకోగలిగాం. దీంతో పంటలు దండిగా పండుతున్నాయి. ఫలితంగా దేశంలో ఉత్పత్తి అవుతున్న ధాన్యంలో సగం వాటా తెలంగాణదే ఉంటోంది’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. సూర్యాపేట లోని సుమంగళి ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సూర్యాపేట నూతన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగాఎన్నికైన సోమ నర్సయ్యకు మంత్రి అభినందనలు తెలిపి మాట్లాడారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని తెలిపారు. రాష్ట్రంలో యాసంగి పంట 56 లక్షల ఎకరాలకు పెరిగిందని, దేశంలో ఎక్కడా ఇంత సాగు లేదన్నారు. 2014కు ముందు మిల్లర్లు రోజూ వందల లీటర్ల డీజిల్ కొని జనరేటర్లతో రైస్ మిల్లులు నడిపేవారన్నారు. గతంలో రైస్ మిల్లులను వ్యాపార కేంద్రంగా చూసేవారు. నేడు ఉపాధి కల్పించే సంస్థలుగా మిల్లులు మారాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్ కొరతతో పాటు రైస్ మిల్లులకు, ఇతర పరిశ్రమలకు పెనాల్టీలు కూడా వేసేవారని గుర్తు చేశారు. పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే టీఎస్ ఐ పాస్ దేశంలో అత్యుత్తమ విధానంగా ప్రసంశలు పొందిందన్నారు. వ్యాపారులకు మోడీ చేసిందేమీలేదన్నారు. రైతు చట్టాలు అమలులోకి వస్తే రైతులు కూలీలుగా, వ్యాపారులు గుమస్తాలుగా మారతారని తెలిపారు. కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహాదేవ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంప గోవర్ధన్, జిల్లా గ్రంథాలయ సంస్థ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మిర్యాలగూడ, వెలుగు : చారిటీ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సూచించారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ హాస్పిటల్‌ను స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు హాస్పటల్ ఏర్పాటు చేసిన నూకల వెంకట్ రెడ్డిని మంత్రి అభినందించారు.