నల్గొండ జిల్లా: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు మద్దతు పలుకుతున్నారని ఈ ఎన్నిక ఫలితాలతో అర్థమైందని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి వాటితో బీజేపీ తమపై దాడులు చేయాలని ప్రయత్నించిందని, కానీ తమకు ప్రజల మద్దతు ఉందని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నెరవేరుస్తామని చెప్పారు. మునుగోడు ఓటర్లు డబ్బు, మద్యానికి అమ్ముడు పోకుండా ధర్మాన్ని గెలిపించారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడును అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఆశించారు. మునుగోడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.