మునుగోడు: నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడని మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బుధవారం మునుగోడులో ప్రచారం నిర్వహించిన మంత్రి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై మండిపడ్డారు. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలుండగా... ఇప్పుడు ఉప ఎన్నికకు పోవాల్సిన అవసరమ ఏమొచ్చిందని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి తన వ్యాపారం కోసమే రాజీనామా చేశారు తప్ప మరొకటి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు పన్నిందని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి మునుగోడును ఏ విధంగా అభివృద్ధి చేస్తాడంటూ ప్రశ్నించారు.
మునుగోడు అంటే తెలియని వాళ్లు కూడా ప్రచారం చేస్తుండ్రు..
మునుగోడు అంటే తెలియని వాళ్లు ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారని మంత్రి జగదీశ్ విమర్శించారు. ఇప్పటికే అమిత్ షా మొదలు చాలా మంది కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు బీజేపీ తరఫున మునుగోడులో ప్రచారం నిర్వహించారని తెలిపారు. కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తే లేని తప్పు.. రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేస్తే వచ్చిందా అని నిలదీశారు. తమకు మునుగోడు ప్రజల సమస్యలు తెలుసు కాబట్టే ఇక్కడ ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేశారు.
బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి నష్టం
మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజీపీ అధికారంలోకి వస్తే రైతుల మోటర్లకు మీటర్లు పెడుతారని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను లేకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పథంలో పయనిస్తోందని, దీన్ని అడ్డుకోవడడానికే బీజేపీ మునుగోడు ఉప ఎన్నికకు కుట్రలు పన్నిందని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థేనని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.