సూర్యాపేటలో ఓ టైలర్ మంత్రి జగదీష్ రెడ్డి పట్ల తన అభిమానం చాటుకున్నాడు. తన షాపు ముందు నుంచి మంత్రి కాన్వాయ్ వెళ్లడాన్ని గమనించిన టైలర్ దేవేంద్ర చారి.. పరుగున వెళ్లి కాన్వాయ్ ని ఆపాడు. దేవేంద్ర చారి రాకను గమనించిన మంత్రి.. వాహనం ఆపాల్సిందిగా సిబ్బందికి సూచించారు. మంత్రి దగ్గరికి చేరుకున్న దేవేంద్ర చారి.. సూర్యాపేటలో మీరు చేసిన అభివృద్ధికి ఉడతా భక్తిగా.. మీరు సమ్మతిస్తే.. నా చేతులతో మీకు బట్టలు కుట్టి బహుమానంగా ఇస్తానని మంత్రికి తెలిపారు.
టైలర్ కోరికను విని మంత్రి మొదట ఆశ్చర్యపోయారు. తర్వాత అతని కోరికను అర్థం చేసుకొని.. మంత్రి కాన్వాయ్ దిగి టైలర్ దుకాణంలోకి వెళ్లి.. కొలతలు ఇచ్చారు. మంత్రి రాకతో చెప్పలేని ఆనందంతో టైలర్ దేవేంద్ర చారి కొలతలు తీసుకున్నారు. తన కోరికను తీర్చిన మంత్రి జగదీష్ రెడ్డికి టైలర్ ధన్యవాదాలు తెలిపారు.