సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని, ఆయన పనితనాన్ని గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని ఆయన సతీమణి గుంటకండ్ల సునీత జగదీశ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి కి మద్దతుగా గురువారం దాసాయిగూడెం లో గడపగడపకు తిరిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సూర్యాపేట పట్టణంలో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవని, ఇప్పుడు మిషన్‌భగీరథ ద్వారా రోజూ తాగునీళ్లు వస్తున్నాయన్నారు.
మూసీ మురికి నీటి గోస తీర్చిన జగదీశ్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు పైసా పనిచేయని నాయకులు మోసపూరిత మాటలతో మళ్లీ వచ్చారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మోసపోతామన్నారు. బీఆర్‌ఎస్‌తోనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సూర్యాపేట అభివృద్ధి విషయంలో 2014 ముందు తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలే ఆలోచన చేయాలని కోరారు.
మరోసారి అవకాశం ఇస్తే సూర్యాపేటను పారిశ్రామిక హబ్ ఏర్పాటుచేసి 10 వేల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం, వంటి పథకాలను బీఆర్ఎస్ అమలు చేస్తుందని తెలిపారు. ఈ నెల 30 న కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.