ఐటీ దాడులతో భయపెట్టడం బీజేపీ మూర్ఖత్వమే : మంత్రి జగదీష్ రెడ్డి 

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై జరిగే ఐటీ దాడులు బీజేపీ ప్రేరేపిత దాడులే అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులతో భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఐటీ దాడులను ఎదుర్కొంటున్న మా నాయకులందరూ తెరిచిన పుస్తకాలే.. అందరూ వైట్ పేపర్ వ్యాపారాలే చేస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో ‘వైద్య ఆరోగ్య దినోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఇదే కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్ రావు, జిల్లా వైద్యారోగ్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలోకి రాక ముందు నుంచే వారికి వ్యాపారాలు ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. వ్యాపారాలు చేస్తూ.. వారంతా లెక్క ప్రకారమే ట్యాక్సీలు చెల్లిస్తున్నారని అన్నారు. ఐటీ దాడులతో భయపెట్టడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఐటీ దాడులకు భయపడేది లేదన్నారు. దాడులతో ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేయడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. బీజేపీది రాజకీయ కక్షేనని.. ఎన్ని దాడులు చేసినా తాము ప్రజల పక్షమే ఉంటామన్నారు. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి (భువనగిరి), మర్రి జనార్థన్ రెడ్డి ( నాగర్ కర్నూలు) సంస్థల్లో ఐటీశాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ ఐటీశాఖ అధికారులు సోదాలు చేశారు. 70 బృందాలుగా ఏర్పడ్డ ఆదాయపన్ను శాఖ అధికారులు అణువణువు గాలిస్తున్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూపు పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి జేసీ బ్రదర్స్ పేరిట వస్త్ర వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే.