నల్గొండ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రతి మాట సీఎం కేసీఆర్ పై విషం చిమ్మేలా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ పై విషం కక్కినా రాష్ట్ర ప్రజలు హంసల్లాంటి వారని, నీళ్లు, పాలను వేరు చేసినట్లు విషాన్ని కూడా వేరు చేస్తారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటమి చెందిందనే మోడీ అక్కసు అన్నారు. రాష్ట్ర ప్రజలు వడ్డీతో సహా మీకే తిరిగి చెల్లిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు మోసపోయేందుకు గుజరాత్ ప్రజలలాంటి వారు కాదని అన్నారు.
నాయకులు, పార్టీలను భయపెట్టి ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. బ్యాంకు లోన్లు రాకుండా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుని.. టీఆర్ఎస్ లో అలజడి చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ పీడ వదిలించుకునేందుకు కేసీఆర్ నాయకత్వంలో మరింతగా ముందుకు పోతామన్నారు. అబద్ధాల పునాదుల మీద బీజేపీ పార్టీ విస్తరణకు ప్రధానమంత్రి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.