యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన సభలో.. మంత్రి జగదీష్ రెడ్డి, బీజేపీ డైరెక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న సభలో.. బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా.. వేదికపై ఉన్న బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్లు అడ్డుకున్నారు. వేదికపై నుంచి బీజేపీ సింగల్ విండో డైరెక్టర్లను లాక్కెళ్లారు పోలీసులు. బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్లపై మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. మంత్రి అసభ్య పదజాలంతో ఎవడ్రా దేశంలో రైతుబంధు ఇచ్చేది, ఎవడ్రా 24 గంటలు కరెంట్ ఇచ్చేది అని దూషించాడు. బీజేపీ ప్రభుత్వాల బట్టలు విప్పుతానని, కేంద్రంలోని బీజేపీ కసాయి ప్రభుత్వమని ఫైరయ్యారు. టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు.
రైతులపై ప్రధాని మోడీ విషం కక్కుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సార్లు రాష్ట్రానికి వచ్చినా ప్రధాని తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ప్రజాక్షేత్రంలోనే బీజేపీకి తగిన బుద్ధి చెబుతామన్నారు.