బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్లపై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్

చౌటుప్పల్ వెలుగు: ‘దేశంలో కేసీఆర్​ కాకుండా ఎవడ్రా రైతుబంధు ఇచ్చేది..ఎవడ్రా 24 గంటల కరెంటు ఇచ్చేది’ అంటూ విద్యుత్ ​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి ..బీజేపీ సింగిల్ విండో డైరెక్టర్లపై ఫైర్ అయ్యారు. శుక్రవారం చౌటుప్పల్ లోని సింగిల్ విండో కార్యాలయంలో ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రితో పాటు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి  లింగయ్య హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన సమావేశంలో గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నారని, బీజేపీ పరిపాలిస్తున్న గుజరాత్ లో రూ.600 ఇస్తున్నారని మాట్లాడాడు. దీంతో బీజేపీ డైరెక్టర్లు ఇది ఎలక్షన్ మీటింగ్ కాదని, రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి మహేందర్ రెడ్డి ‘అవును ఇది ముమ్మాటికి ఎలక్షన్ మీటింగే’ అని అన్నారు. దీంతో బీజేపీ డైరెక్టర్లకు మహేందర్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో మంత్రి మైక్ తీసుకుని ‘బీజేపీ పాలించే గుజరాత్​లో ఇక్కడున్నట్టు ఉన్నదారా’ అంటూ పరుష పదజాలం ఉపయోగించారు. నిజాలను ఒప్పుకోలేని బీజేపీ లీడర్లకు సిగ్గు ఉండాలన్నారు. వారిని బట్టలిప్పి కొడతామని హెచ్చరించారు. దీంతో బీజేపీ డైరెక్టర్లు దుర్గ కృష్ణ, బాతు రాజు, సప్పిడి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమావేశం ముగిసే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచి మంత్రి వెళ్లిపోయాక పంపించివేశారు. తర్వాత బీజేపీ డైరెక్టర్లు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు అధికారిక కార్యక్రమాన్ని కూడా టీఆర్ఎస్ మీటింగ్ లాగా వాడుకుంటున్నారన్నారు. సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎస్ రెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.