సూర్యాపేట, వెలుగు:‘‘ఎండాకాలం మా కొంపలు ముంచేలా ఉన్నారు.. మీ వల్ల ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది” అంటూ మిషన్ భగీరథ ఆఫీసర్లపై విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం సూర్యాపేటలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక అధ్యక్షతన జరిగిన జడ్పీ జనరల్‌బాడీ మీటింగ్‌లో ఆయన ఈ కామెంట్లు చేశారు. తన నియోజకవర్గంలోని గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఈసమావేశం సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ చెప్పారు. చిల్పకుంట మెయిన్ గ్రిడ్‌లో మోటార్లు పనిచేయకున్నా.. ఆఫీసర్లు ఇప్పటివరకు వాటి రిపేరింగ్ కోసం బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టలేదన్నారు.
మోటార్లు రిపేర్ కాకపోవడంతో 15 రోజులకు ఒక్కసారి కూడా గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ వెంటనే హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హుజూర్ నగర్ నియోజకవర్గానికి అవంతిపురం గ్రిడ్ నుంచి ప్రెజర్రాకపోవడంతో ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు. కనీసం నీటి సరఫరా పై అధికారులు రివ్యూ కూడా చేయడం లేదు ”అని తెలిపారు. అక్కడే ఉన్న మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్ సీఈలు పాపారావు, వెంకటేశ్వర్లు, అవంతిపురం గ్రిడ్ డీఈ నవీన్ స్పందిస్తూ.. మిషన్ భగీరథకు సంబంధించి గ్రామాల్లో 312 సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జగదీశ్.. సరైన ప్లానింగ్ చేయకుండా, హైట్‌లో ట్యాంకులను నిర్మించడం వల్లే నీళ్లు ఎక్కడం లేదన్నారు. ‘‘రైతుల మోటార్లు 60 ఏండ్లు నడుస్తున్నా.. భగీరథ మోటార్లు ఐదేండ్లకే ఎందుకు రిపేర్లకు వస్తున్నాయో సమాధానం చెప్పండి. గ్రిడ్‌లో మోటార్లు నెలకు మూడుసార్లు రిపేర్‌కు వస్తున్నయ్. ఎండాకాలం మా కొంపలు ముంచేలా ఉన్నారు. మీ వల్ల ఎన్నికల్లో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఈ ఎండాకాలంలో ఎవ్వరూ సెలవు పెట్టకుండా ఇంటింటికీ భగీరథ నీళ్లందించే ఏర్పాట్లు చేయాలె. పాత సిస్టమ్ వల్లే మేం బచాయిస్తున్నం.ఇప్పటికీ దోసపహాడ్ స్కీం నుంచే సూర్యాపేట మున్సిపాలిటీకి నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంది”అని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.