కేసీఆర్ నాయకత్వంలో దేశానికి మంచి రోజులు : జగదీష్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా సూర్యాపేటలో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు పథకం ప్రజలకు ఒక వరంలాంటిదని ఆయన అన్నారు. కంటి సమస్యలతో బాధపడేవారికి ఇంటి వద్దే పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు.

దేశ రాజకీయాల్లో మార్పుకు ఖమ్మం సభ నాంది పలికిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీ హయాంలో దేశం తిరోగమిస్తున్న తీరును కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైందని.. కేసీఆర్ నాయకత్వంలో దేశానికి మంచి రోజులు వస్తాయన్నారు. దేశం వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమన్న ఆయన.. ఆ పార్టీల మాటలను ప్రజలు పట్టించుకోరన్నారు.దేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే నూతన లక్ష్యాలు పెట్టుకుని ప్రయాణం ప్రారంభించాలని కేసీఆర్ పిలుపునిచ్చారన్నారు.