సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్ రెడ్డికి టైమ్ కలిసి రావట్లేదనే చర్చ జోరుగా జరుగుతున్నది. కొన్ని రోజులుగా జగదీశ్ రెడ్డి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 50వేల గోడ గడియారాలు పంచారు. గడియారంపై ఆయనతో పాటు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్ ఫొటోలు ఉన్నాయి.
ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు, పార్టీ కేడర్, అనుచరులకు జగదీశ్‌రెడ్డి ఇప్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలంతా మంత్రిపై గుర్రుగా ఉన్నారు. దళిత బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ రాలేదంటూ ప్రతి గ్రామంలో జనం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.
ఈ క్రమంలో పలువురు బాధితులు మంత్రి మీద ఉన్న కోపాన్ని.. ఆయన ఇచ్చిన గడియారాలపై చూపిస్తున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ తన అనుచరులకు ఇప్పించుకుని.. వంద రూపాయల గడియారాలు మాకెందుకు ఇచ్చినట్లు అంటూ రోడ్లపై వేసి పగులగొడ్తూ గుస్సా అయితున్నరు.