ధాన్యం కొనుగోళ్ల పై  మంత్రి జగదీశ్ రెడ్డి సీరియస్ 

సూర్యాపేట, వెలుగు: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ ధాన్యం కొనుగోళ్లపై సూర్యాపేట కలెక్టరేట్​లో మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, ఆడిషనల్​కలెక్టర్ మోహన్ రావులతో కలిసి వివిధ శాఖల అధికారులు మిల్లర్లు, ట్రాన్స్​పోర్ట్​ కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రబీ సీజన్‌‌లో జిల్లా నుంచి కొనుగోలు లక్ష్యం 7లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 213 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను నిలదీశారు.

ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చెయ్యకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనడానికి ముందుకు రావడం ఏమిటన్నారు. అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. సరిపడా హమాలీలను నియమించుకుని కొనుగోళ్లు స్పీడప్​చేయాలన్నారు.

క్వాలిటీ పేరుతో కోతలు పెట్టొద్దన్నారు. సీఎంఆర్​రైస్ గురించి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారి నుంచి బియ్యం రికవరీ చేయాలని ఆదేశించారు. డిఫాల్టర్ల పై దృష్టి సారించాలన్నారు. తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందొద్దని, చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే అదేశించారన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామన్నారు.