కాంగ్రెస్ పార్టీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా రైతులకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల పాటు కరెంటు అందించిన దాఖలాలు లేవన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 70 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందని, ఇప్పటికీ కరెంటు చూడని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఆ రాష్ట్రానికి మించిన విద్యుత్ తయారవుతున్నా అక్కడ రైతులకు నేటికీ 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అని మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యలు.. చంద్రబాబు పార్టీ సిద్ధాంతాలే అని చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించిన రైతువేదిక కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా పాల్గొన్నారు.
బీజేపీ అవినీతి వల్ల మరో పార్టీ లేక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారే తప్ప ఆ పార్టీ వల్ల అక్కడి ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కర్ణాటకలో కూడా రైతులకు 24 గంటల పాటు కరెంటును కాంగ్రెస్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ కు ఒక సిద్ధాంతం అనేది లేదన్నారు. ఏఐసీసీ నేతలు ఒకలా మాట్లాడితే.. తెలంగాణ నాయకులు మరోలా మాట్లాడుతారని చెప్పారు. తాము లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్పడం చేతకాక.. రేవంత్ రెడ్డి బూతు పురాణాలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడడం నాయకుడి లక్షణం కాదంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులపై ఉండే వ్యామోహం పరిపాలనపై ఉండదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు, రైతుబీమా, రైతుబంధు కల్యాణ లక్ష్మి వంటి పథకాలు ఉండవన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్లీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.