బెదిరిస్తాం, భయపెడుతామంటే ఊరుకునేది లేదు.. తొక్కి నార తీస్తా : మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా : ఎవరైనా తనను బెదిరిస్తాం, భయపెడుతామంటే ఊరుకునేది లేదు.. వారిని తొక్కి నార తీస్తానని హెచ్చరించారు మంత్రి జగదీష్ రెడ్డి. తప్పు చేస్తే ఎవరైనా సహించేది లేదన్నారు. తన వెంట ఉన్న వారైనా సరే తప్పు చేస్తే జైలుకు పంపిస్తానని చెప్పారు. ఈ మధ్య కొంతమంది తనపై విమర్శలు చేయబోతున్నారని, తాను దేనికీ భయపడనని అన్నారు. 

కొంతమంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చేటప్పుడే ముందుగానే చెప్పానని, ఆ పార్టీల్లో ఉన్నట్లు ఇక్కడ (బీఆర్ఎస్ లో)  చేస్తే కుదరదని చెప్పానన్నారు. అంతకుముందు.. సూర్యాపేట జిల్లా కేంద్రంలో DMFT(డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) నిధుల నుండి టైలర్ వృత్తిదారులకు కుట్టు మిషిన్స్ పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఓట్ల కోసమే తాను రాజకీయం చేయడం లేదని, ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లో ఉన్నానన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. అవినీతి ఎవరైనా చేస్తానంటే ఊరుకోనని చెప్పారు. ఏం కోరుకుని సూర్యాపేట ప్రజలు తనను ఎన్నుకున్నారోతనకు బాగా తెలుసన్నారు. సూర్యాపేట ప్రజలకు సేవ చేయడం కోసమే తాను ఉన్నట్లు చెప్పారు.