బీఆర్ఎస్ తో పని చేసేందుకు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయి

నల్లగొండ :- రాష్టంలో, దేశంలో ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం  అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తోందని, దర్యా్ప్తు సంస్థలను కేంద్రం తమ సొంతానికి వాడుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితిలో ఉందన్నారు. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో కలిసి పని చేయడానికి దేశంలోని చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీపీఎం, సీపీఐ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. 

గతంలో బీజేపీకి డిపాజిట్ రాలేదు
మునుగోడు నియోజకర్గంలో బీజేపీ పాచికలు వేసి, గెలవాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసమే టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నామని చెప్పారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. మునుగోడులో గతంలో సీపీఐ ప్రాతినిధ్యం వహించిందని చెప్పారు. 

టీఆర్ఎస్ తో కలిసి బీజేపీని ఓడిస్తాం
మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతోందని సీపీఎం సీనియర్ నాయకులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. టీఆర్ఎస్ తో కలిసి బీజేపీని ఓడిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని ఒంటరి చేయడం కోసం కలిసి పని చేస్తామని తెలిపారు. సీపీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ఆదరించాలని కోరారు.