సూర్యాపేట జిల్లా : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీఆర్ఎస్ జెండానే ఎగురుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. పనిచేసే వారికి పట్టం కట్టాలి.. వృద్ధులను పక్కకు పెట్టాలన్నారు. కాంగ్రెస్ వృద్ధ నాయకులను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందన్నారు. ప్రజలని మోసగించడానికి ప్రతిపక్ష నాయకులు వస్తున్నారని, వాళ్లకి సరైన రీతిలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
దేశానికే అన్నం పెడుతున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని, అది కూడా సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం ఎగుమతిలో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్లు ఎంతమంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు బుగ్గ మాదారంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారరథం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.