రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తలేదు : జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఫ్లోరోసిస్ ను తరిమికొట్టేందుకే జిల్లాకు రెండు ప్రాజెక్టులను తీసుకొచ్చామని చెప్పారు. వాటి పనులు కొంత ఆలస్యమైనా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మునుగోడులో సాగునీరు అందుబాటులోకి వస్తే రెండు మూడేండ్లలో ఫ్లోరోసిస్ పారదోలవచ్చని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చామని చెప్పారు. గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్న ఆయన..  ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ నల్లగొండ జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు.

బీజేపీకి రాష్ట్రంలో స్థానంలేదన్న మంత్రి జగదీష్ రెడ్డి.. గెలిచిన రెండు ఉప ఎన్నికల్లో వ్యక్తిగతంగా, సానుభూతితో గెలిచారని చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పాత్రను బీజేపీ పోషించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యారని స్పష్టం చేశారు. రూ.18వేల కోట్లతో ఓ కుటుంబాన్ని బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉపఎన్నిక సృష్టించి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని.. సీఎం జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదని.. కానీ రాజకీయాల కోసం రూ.18,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మూడేండ్లు ఎమ్మెల్యే గా ఉన్న రాజగోపాల్ రెడ్డి కనీసం కళ్యాణ లక్ష్మీ చెక్ లు కూడా పంపిణీ చేయలేదని చెప్పారు. పెండింగ్ పనులు, రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలంటే మునుగోడులో టీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కు మునుగోడు కొత్త అని..కానీ టీఆర్ఎస్ కు కొత్త కాదన్నారు. సీఎం కేసీఆర్ తో సహా తమ నాయకులు ఉద్యమకాలంలో మునుగోడులో పల్లె నిద్రకు చేసిన వారే అని గుర్తు చేశారు.