సూర్యాపేట, మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జడ్పీహెచ్‌ఎస్‌లో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ను ప్రారంభించి.. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం పాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో రూ. 50 కోట్లతో నిర్మించనున్న క్రీడా పాఠశాల, స్టేడియం, కాసింపేట వద్ద ఎస్సారెస్పీ కాలువపై బ్రిడ్జి, రూ. 3 కోట్లతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేయడంతో పాటు రూ. 80 లక్షల నిర్మించిన కుమ్మరి సంక్షేమ భవన్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రేక్ ఫాస్ట్‌తో స్కూల్స్‌లో డ్రాప్‌ఔట్స్ తగ్గడంతో పాటు విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందుతుందన్నారు. యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా లైబ్రరీ నిర్మిస్తామని, సెంట్రల్ ఏసీతో పాటు డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్‌రావు, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, డీఈవో అశోక్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజుల రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారం షురూ...
మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం చింతలపాలెం మండలం బుగ్గమాదారం గ్రామంలోని పంచపట్టాభిరామ ఆలయంలో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో 3500 కోట్లతో హుజూర్ నగర్‌ను అభివృద్ధి చేశామని, సాగర్ ఎడమ కాల్వకు వరుసగా నీళ్లందిస్తున్నామని చెప్పారు.
హుజూర్‌నగర్‌ను ఇరవై ఏళ్లు ఏలిన కాంగ్రెస్ నాయకుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, సార్ అని పిలిపించుకునే నాయకుడు కావాలో..? అన్న అని పిలిపించుకునే నాయకుడు కావాలో..? ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.