కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకట్లే : జగదీశ్​రెడ్డి

దేవరకొండ, వెలుగు : కాంగ్రెస్​అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మళ్లీ చీకట్లు అలుముకోవడం ఖాయమని మంత్రి జగదీశ్​రెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని సాయిరమ్య ఫంక్షన్​హాల్​లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్​ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సీసీ బ్యాంక్​ను దోపిడీ చేసిన వ్యక్తికి, అభివృద్ధి పనులను కమీషన్​లకు అమ్ముకునే వ్యక్తికి దేవరకొండ ప్రజలు ఓటేస్తారో..  సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా పని చేస్తున్న బీఆర్​ఎస్​ అభ్యర్ధి రవికుమార్​కు ఓటెస్తారో నిర్ణయించుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను కార్యకర్తలు గ్రామగ్రామాన ప్రజలకు తెలియజేయాలని కోరారు. రానున్న నాలుగేళ్లలో పూరి గుడిసె లేని రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, గుత్తా అమిత్​రెడ్డి, కేతావత్​ బీల్యానాయక్, నాయకులు పాల్గొన్నారు. 

బుజ్జగించినా రాలే.. 

సమావేశానికి ముందు మంత్రి జగదీశ్​రెడ్డి శనివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్​తో కలిసి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు ఇంటికివెళ్లాడు. అక్కడికే మరో అసమ్మతి నేత కౌన్సిలర్​ హన్మంతు వెంకటేశ్​గౌడ్​ను పిలిపించి ఇద్దరితో చర్చించారు.

పార్టీలో తమకు జరిగిన అవమానాలను వారు మంత్రికి వివరించారు. పొరపాట్లను సర్దుకుందామని,  భవిష్యత్తులో రాజకీయంగా తగిన ప్రాధాన్యతను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కావాలని కోరారు. కానీ వారు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు.