కేసీఆర్ కీర్తి ఢిల్లీ తాకుతుందని మోడీకి భయం.. ప్రధానికి బీఆర్ఎస్ కౌంటర్

కేసీఆర్ కీర్తి ఢిల్లీ తాకుతుందని మోడీకి భయం.. ప్రధానికి బీఆర్ఎస్ కౌంటర్

వరంగల్‌ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి జగదీష్ రెడ్డి. వరంగల్ కి వచ్చిన మోడీ తెలంగాణకు మొండిచేయి ఇచ్చి.. తన అక్కసు వెళ్లగక్కి వెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేస్తున్న మంచిని చూడలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ కీర్తి ఢిల్లీ తాకుతుందని భయం మోడీకి పట్టుకుందన్నారు. ప్రధాని తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడారని, అన్ని అబద్దాలు, అక్కసు తప్ప ఏమీ లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. అవినీతి జాబితాలో తెలంగాణకు స్థానం లేదని మోడీకి తెలుసన్నారు. 

అవినీతిలో  బీజేపీ పార్టీ కాంగ్రెస్ ను మించిపోయిందన్న మంత్రి జగదీష్ రెడ్డి.. ప్రధాని మోడీ అవాకులు చెవాకులు తప్ప ఏం చెప్పారని ప్రశ్నించారు. గుజరాత్ లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమన్నారు. కర్ణాటకలో40 శాతం కమీషన్ ఎవరిదని ప్రశ్నించారు. తాము తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని, ఇలాంటి గురుకులాలు గుజరాత్ లో ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అవినీతిలో మాత్రమే గుజరాత్ తెలంగాణ కంటే ముందుందన్నారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణ సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. 

కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో త్యాగాలు చేశారని, మోడీ పరివారం మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మోడీ అబద్దాలను తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని,  కేంద్రం ఇచ్చిన అవార్డులే అందుకు నిదర్శనమన్నారు. తప్పులు చేస్తూ మాపై నిందలు మోపుతారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ వేట కుక్కలు మా వెంటే తిరిగి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. వ్యాగన్ తయారీ చేసుకునే సత్తా తమకు కూడా ఉందన్నారు.

2014లో అవకాశం ఇస్తే నల్లధనం తెస్తానని చెప్పి చేయలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మోడీ నీతి గురువింజను తలపిస్తోందన్నారు. జనాభాలో 10వ స్థానంలో ఉన్న తెలంగాణ.. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఐదో స్థానంలో నిలిచిందని చెప్పారు. కేంద్రం ఇస్తున్న అవార్డులు ఇతర రాష్ట్రాలకు ఎందుకు రావడంలేదన్నారు. రాహుల్ గాంధీ , మోడీ ఇద్దరు ఒక్కటై దేశాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశం వెనుకబాటుకు కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలే అని వ్యాఖ్యానించారు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే రారాజు బీజేపీ అని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, ప్రభుత్వాలను కూల్చడం బీజేపీ చేస్తోందన్నారు. 

తెలంగాణ ప్రజలు చైతన్యవంతులేనని, అన్యాయానికి, అవినీతికి అవకాశం ఇవ్వరని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల -కరీంనగర్‌ -వరంగల్‌ జాతీయ రహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల- వరంగల్‌ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.